భీమ్ న్యూస్ ప్రతినిధి తోటపల్లి గూడూరు (ఫిబ్రవరి 02) నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీలో రికార్డులు అదృశ్యమయ్యాయి. వరిగొండ పంచాయతీలో వేసిన లే అవుట్ ల వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు చేస్తే, ఆ దరఖాస్తుకు సమాధానంగా అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. ప్రత్యక్ష పరిశీలన చేస్తే వరిగొండ పంచాయతీలో 28 కి పైగా లే అవుట్ లు వేసి వుండగా, ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఇచ్చిన సమాచారంలో పంచాయతీ నందు మొత్తంగా వేసిన లే అవుట్ లు 23 అని, నుడా అనుమతులు వుండేవి 05 అని, DTCP లే అవుట్ లు 12 అని, అనధికార లే అవుట్ లు 06 అని స్పష్టం చేస్తూ, 12 లే అవుట్ ల వివరాలు మాత్రమే ఇచ్చారు. అన్నీ లే అవుట్ లు వివరాలు ఇవ్వలేదని మండల విస్తరణాధికారి వసుందరా దేవిని వివరణ కోరగా వరిగొండ పంచాయతీ కార్యదర్శి ప్రవల్లిక ను అడగమని చెప్పడం గమనార్హం.
వరిగొండ పంచాయతీ కార్యదర్శి ప్రవల్లిక ను వివరణ కోరగా, నేను ఈ పంచాయతీకి కార్యదర్శిగా వచ్చి రెండు నెలలు అయ్యింది, ఆ వివరాలు వున్న రికార్డులు సచివాలయం నందు అందుబాటులో లేవని చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు సంవత్సరాలు ఇదే పంచాయతీకి కార్యదర్శిగా పనిచేసిన ప్రవల్లిక లే అవుట్ రికార్డులు లేవని చెప్పడం విశేషం. అనధికార లే అవుట్ ల వివరాలు వున్న రికార్డులు సచివాలయం నందు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు అవినీతి అధికారుల అండదండలతో ప్రభుత్వ శివాయి భూములు, నీటి పారుదల కాలువ పోరంబోకు భూములు అక్రమంగా కబ్జా చేసి కోట్లల్లో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారని గ్రామ ప్రజల్లో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తుంది. పంచాయతీలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రావాలన్నా, ప్రభుత్వ భూములను కాపాడాలన్నా ఉన్నతాధికారులు ఈ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
Leave a Reply