భీమ్ న్యూస్ ప్రతినిధి నగరి (ఫిబ్రవరి 02) చిత్తూరు జిల్లా నగరి సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు బస్సును గుర్తుతెలియని భారీ వాహనం పక్క నుంచి ఢీకొట్టిడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యుఒడికి చేరారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు.. నగరి మున్సిపల్ పరిధి టూరిజం రెస్టారెంట్ సమీపం, జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి నగరి నుంచి తిరుపతికి వెళుతున్న ప్రైవేటు బస్సును గుర్తు తెలియని భారీ వాహనం పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వడమాలపేట సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారథి నాయుడు (62), రాజేంద్రనాయుడు (60), తిరుపతికి చెందిన దినేష్ (8), తిరుత్తణికి చెందిన కుమార్ (60) మృతిచెందారు. తమిళనాడు తిరువళ్లూరుకు చెందిన చెన్నామలై (55) పరిస్థితి విషమంగా ఉండగా, తిరుపతికి చెందిన సుబ్బరత్నమ్మ (42), భరత్ (40), తిరువళ్లూరుకు చెందిన సుధాకర్ (50) తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతికి చెందిన రాధాకృష్ణ, శెల్వి, నాగేంద్ర, ఊత్తుకోటకు చెందిన కె.మురళి, తిరువళ్లూరుకు చెందిన రుద్రమూర్తి, శివగిరికి చెందిన అనురాధ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.
వైద్యులు వేగంగా స్పందించిన వైనం :
క్షతగాత్రులకు వేగంగా వైద్యసేవలందించడంలో ఏరియా ఆస్పత్రి వైద్యులు ప్రశంసలు అందుకున్నారు. మెడికల్ సూపరింటెండెంట్, ఆర్ఎంవో, వైద్యులు అందరూ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని వైద్యసేవలందించారు. పోలీసులు కేసు నమోదుచేసి ఢీకొన్న వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
క్షతగాత్రుల తీవ్ర గాయాలతో ఆస్పత్రికి చేరుకోవడం.. వారిని స్టెచర్లలో అటూ ఇటూ తీసుకెళ్లడంతో వార్డులంతా రక్తసిక్తమైంది. ఆ ప్రాంతంలో ఉన్నవారు అక్కడి పరిస్థితిని చూసి తట్టుకోలేక బయటకు పరుగులు తీశారు.
అతివేగమే కారణం..?
అతివేగమే ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. బస్సు వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనాన్ని అదుపు తప్పించే ప్రయత్నంలో పక్కకు తిరగడం ఒక్కసారిగా ఏదో వాహనం గుద్దినట్లు ఢాం అని పెద్ద శబ్దం వచ్చిందని బస్సు అద్దాలన్నీ పగిలి అందరూ చిందరవందరగా పడిపోయామని తెలిపారు. ప్రతిరోజూ టైమింగ్‌కు వెళ్లాలంటూ ప్రైవేటు బస్సులు వేగంగానే వెళుతున్నాయని వారు ఆరోపించారు.
నాన్నా లేరా అమ్మని వచ్చాను …. తల్లి :
నాన్నా లేరా అమ్మని వచ్చాను..! అంటూ ఓ బాలుడి మృతదేహం వద్ద తల్లి పడిన ఆరాటం కదిలించింది. బిడ్డా కానరాని లోకాలకు వెళ్లిపోయావా..? అంటూ కన్నీరుపెట్డం అందరినీ కలచివేసింది. బస్సులో తన ఒడిలో పడుకొని నిద్రిస్తూ వచ్చిన కుమారుడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడం తట్టుకోలేక ఆమె స్ఫృహ తప్పిపడిపోవడంతో వైద్యులు ప్రత్యేక వైద్యచికిత్స అందించారు.
Leave a Reply