భీమ్ న్యూస్ ప్రతినిధి కోల్‌కతా – జాతీయం (ఫిబ్రవరి 07) సెలవు అడిగితే ఇవ్వలేదనే కోపంతో ఒక ప్రభుత్వ ఉద్యోగి తను పనిచేసే చోట నలుగురు సహోద్యోగులపై కత్తితో దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని న్యూటౌన్ ఏరియాలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని అమిత్ కుమార్ సర్కార్‌గా గుర్తించారు. అమిత్ కుమార్ కరిగరి భవన్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేస్తున్నారు.అమిత్ సర్కార్ దాడిలో గాయపడిన నలుగురు సహోద్యోగులను జయదేవ్ చక్రవర్తి, శంతను సాహ, సార్త, షేక్ సతబుల్‌గా గుర్తించారు. గాయపడిన నలుగురుని వెంటనే తోటి సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమిత్ సర్కార్ స్వస్థలం అదే రాష్ట్రంలోని నార్త్ 24 పర్గనాస్ జిల్లా సోడేపూర్ సమీపంలోని ఘోలా గ్రామం. తను పనిచేసే చోట సెలవు విషయంలో తోటి సిబ్బందితో అమిత్ కుమార్‌కు వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తరువాతే అమిత్ వారిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఆఫీస్ సిబ్బంది అమిత్‌కు ఎందుకు సెలవు నిరాకరించారనేది ఇంకా తెలియరాలేదు. అమిత్ మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. దాడి చేసిన తరువాత ఆఫీస్ బయటే నెత్తుటి కత్తి పట్టుకుని తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాడి ఘటనపై సమాచారం అందుకున్న కోల్‌కతా పోలీసులు హుటాహుటిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి చేరుకుని నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
Leave a Reply