భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు నగరం (ఫిబ్రవరి 10) నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని తిక్కన భవనం నందు సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ కి అఖిల భారత హిందూ మహాసభ పార్టీ సర్వేపల్లి బీసీ సెల్ అధ్యక్షుడు అలారి మునేష్ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మునేష్ మాట్లాడుతూ ముత్తుకూరు మండలం వెలుగు కార్యాలయంలో ఈ నెల 08వ తేదీన శనివారం జరిగిన సమావేశంలో అన్యమత ప్రచారం జరుగుతుండగా ఆ సమయంలో ఓ పాత్రికేయుడు ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి వార్తను ప్రచురించడం జరిగిందని అన్నారు. అంతే కాకుండా ప్రతి నెలా 26వ తేదీన మండల వెలుగు కార్యాలయం నందు సంఘబంధం లీడర్లకు, వి.ఓ.ఏ. లకు పొదుపు మహిళల రుణాల లావాదేవీలు, ప్రభుత్వ పథకాలు గురించి సమావేశం నిర్వహిస్తారని, ఆ సమావేశం ప్రారంభంలో ఏ.పీ.ఎం. నిర్మలమ్మ అధ్యక్షతన సీ.సీ. మధుసూధన్ చేత అన్యమత గీతాలాపనలు, ప్రార్థన చేయించడం జరుగుతుందని తెలిపి, ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నీ మతాల అధికారులు, సిబ్బంది తమ విధులు నిర్వహిస్తుంటారని, అక్కడ మత ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయం నందు జరిగే పొదుపు మహిళల సమావేశాల్లో ఇలా అన్యమత ప్రచారం చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా, సదరు అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల భారతీయ జనతా పార్టీ నాయకుడు పవన్ కుమార్ తో పాటుగా పొదుపు మహిళలు పాల్గొన్నారు.
Leave a Reply