భీమ్ న్యూస్ ప్రతినిధి తోటపల్లి గూడూరు (ఫిబ్రవరి 10) అంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తోటపల్లి గూడూరు మండలం అధ్యక్షుడు ఉండ్రాళ్ళ శ్రీనివాసులు నేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కోవి వెంకటేశ్వరరావుని కలిసి ఫిర్యాదుపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉండ్రాళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ నందు వేసిన అనధికార లే అవుట్ లలో మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ ప్రక్కన బి.ఆర్. నగర్ లే అవుట్ ఒకటి వున్నది. ఈ లే అవుట్ యాజమాన్యం, లే అవుట్ లో 10% భూమిని పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే మధ్య దళారులు కొంతమంది ఆ పది శాతం భూమిని ఆక్రమించి అందులో తారు రోడ్డు వేసిందే కాక, కొంత భూమిని కూడా అక్రమంగా అమ్మకాలు చేశారని గతంలో గ్రామ ప్రజలు నుండి వచ్చిన ఫిర్యాదులు మేరకు పంచాయతీ మరియు మండల అధికారులు చొరవ తీసుకుని తారు రోడ్డును తొలగించి పదిశాతం భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ భూమిలో పంచాయతీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి, పది శాతం భూమి చుట్టూ కంచెను కూడా వేశారు. కానీ సదరు వ్యక్తులు మళ్ళీ ఆ కంచె తొలగించి, మళ్ళీ తారు రోడ్డు వేసుకున్నారు. ఇలా పలు మార్లు జరిగిందని తెలిపి, దీనిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించి, పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసిన పది శాతం భూమిని కాపాడాలని కోరుతూ ఉండ్రాళ్ళ శ్రీనివాసులు నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ. కి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం సభ్యుడు కొక్కంటి వెంకట సుబ్బయ్య కూడా పాల్గొన్నారు.
Leave a Reply