భీమ్ న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ – జాతీయం (ఫిబ్రవరి 14) హైదరాబాద్లోని గాంధీ భవన్లో శుక్రవారం కుల గణనపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహించగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీపై విమర్శలు చేశారు. కులగణనపై లేని అపోహలను సృష్టించి తప్పుల తడక అని చెప్పాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజం నిప్పులాంటిది వారినే దహిస్తుంది తప్ప ప్రజలకు నష్టం కలిగించదు’ అని తెలిపారు.
ప్రధాని మోదీ అసలు బీసీ కాదని తేల్చి చెప్పారు. ‘ప్రధాని మోదీ బీసీ కాదు.. కన్వర్టెడ్ బీసీ’ అని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కుల గణనను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని.. అనవసరంగా దీనిపై విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కుల గణన చేసి బలహీన వర్గాల జనాభా లెక్కగట్టి వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సబ్ కమిటీ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. ‘సాంకేతికంగా.. న్యాయపరంగా కులగణనపై నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాం. కేలగణన ప్రకారం 56.33 శాతం బలహీనవర్గాల లెక్క తేలింది’ అని వివరించారు. త్యాగానికి సిద్ధమయ్యే ఈ లెక్కలను పక్కాగా చేయించామని ప్రకటించారు.
‘కులగణనలో ఒక్క తప్పు లేదు.. వాళ్లు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేం తీసుకున్నాం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనజీవన స్రవంతిలో కలవని వారికి కూడా మళ్లీ అవకాశం ఇచ్చామని వివరణ ఇచ్చారు. ‘కులగణనపై బీజేపీ కుట్రలు చేస్తోంది. ప్రధాని మోదీ బీసీ కాదు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ’ అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘మోదీ పుట్టుకతోనే ఉన్నత కులం.. 2001 లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు’ అని ఆరోపించారు.ప్రధాని మోదీ బీసీ అయితే ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేస్తే దాన్ని కూడా తప్పుపట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణనను త్వరలోనే చట్టం చేయబోతున్నట్లు ప్రకటించారు.
Leave a Reply