భీమ్ న్యూస్ ప్రతినిధి పలమనేరు (ఫిబ్రవరి 16) చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్ధినిని గుర్తు తెలియని వ్యక్తి గర్భవతిని చేశాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు.నెలలు నిండటంతో పురిటి నొప్పులు వచ్చాయి. ఆడబిడ్డను ప్రసవించి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చి బిడ్డను ప్రసవించే సమయంలో ప్రాణాలు కోల్పోయింది. బాలికను గర్భవతిని చేసిందెవరో కూడా తల్లిదండ్రులకు తెలియక పోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుమార్తె విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గుట్టుగా ఉంచారు. పరువు పోతుందని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టారు.చిత్తూరు జిల్లా పలమనేరు మండలానికి చెందిన బాలిక(16) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో కొద్దినెలల క్రితం బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసినా తల్లిదండ్రులు ఆమెను బడికి పంపకుండా ఇంట్లోనే ఉంచారు. శనివారం రాత్రి బాలికకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బాలికను పరీక్షించిన బంగారు పాళ్యం వైద్యులు మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆదివారం ఉదయం బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే తల్లి బిడ్డలను అంబులెన్సులో తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా తల్లి మృత్యువాత పడింది.చిన్న వయసులో గర్భం దాల్చడంతో ప్రసవానంతరం సమస్యలతో అపస్మారక స్థితిలో ఆస్పత్రికి చేరినట్టు తిరుపతి వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే బాలిక పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాలిక గర్భానికి కారకులెవరనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబ సభ్యులనూ విచారించి వివరాలు తెలుసుకోనున్నారు. పలమనేరు సీఐ నరసింహరాజు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Leave a Reply