భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (ఫిబ్రవరి 17) ఏపీలోని దేవాలయాల్లో మౌలిక వసతులు పెంచామని వెల్లడించారు. ఏడు నెలల్లోనే దేవాలయాలకు రూ.134 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అర్చకులకు వేతనాలు, వేద పాఠశాలలకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రముఖ ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేసి కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నామని వివరించారు.
తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు (ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో)ను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నారని చంద్రబాబు కొనియాడారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనం చాలా ముందున్నామని, దేశంలో యువత ఎక్కువగా ఉండడం మనకు మరో అదృష్టమని అన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో ఒకటి లేదా రెండో స్థానానికి ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
టెక్నాలజీ సాయంతో ఆలయాల్లో కార్యక్రమాలు సులభతరం అవుతున్నాయని అన్నారు. దేవుడి పేరిట సమాజానికి సేవ చేసేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. దేవుడికి సేవ చేయడం అన్నిటి కంటే ఎంతో గొప్పది అని పేర్కొన్నారు. తిరుమల బాలాజీ అంటే కోట్ల మంది భక్తులకు నమ్మకం, ప్రగాఢ విశ్వాసం అని వివరించారు.
దేవాలయాలు ఆధ్మాత్మిక కేంద్రాలే కాదు… ప్రధాన ఆదాయ వనరులు కూడా అని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాలంలో అందరూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఎందరో భక్తులు రూ.కోట్లలో విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు. విరాళాలను విద్య, వైద్యం, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు.
నాడు ఎన్టీఆర్ ఏపీ దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇవాళ నిత్యం లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని వివరించారు. దేశ విదేశాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలు పెరుగుతున్నాయని, ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. ఏపీలో దేవాలయాల సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.ఏపీలోని దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, దేవాలయాల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తిరుమలలో 75 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో ఆలయాలది ప్రధాన పాత్ర అని తెలిపారు.
ఆలయాలు చూసి విదేశీయుల్లో ఆశ్చర్యం: ఫడణవీస్
మన దేవాలయాల చరిత్ర ఎంతో పురాతనమైనదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ”దక్షిణ భారత్‌లోని ఆలయాలు చూసి విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు. వేల ఏళ్ల క్రితం ఇలాంటి ఆలయాలు ఎలా కట్టారని అడుగుతారు. దేవాలయాల ప్రాంగణాల్లో ఆనాడు విద్యార్థులకు బోధన జరిగేది. ఇవాళ 55 శాతం మంది పర్యాటకులు ధర్మ పర్యటన చేస్తున్నారు. దేవాలయాలతో మన సంస్కృతి ముడిపడి ఉంది. మన జీవితంలో దేవాలయాల పాత్ర విడదీయరానిది” అన్నారు.
మన సంస్కృతి.. ఆలయ సంస్కృతి: ప్రమోద్ సావంత్
”ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా జరుగుతుంటే తిరుపతిలో ఆలయ కుంభమేళా జరుగుతోంది. రాష్ట్రం, సంస్కృతి, భాష, వేషం వేరైనా మనందరం ఒక్కటే. మన సంస్కృతి ఆలయ సంస్కృతి. సనాతన ధర్మాన్ని ఆచరించడం అందరి కర్తవ్యం. రామ మందిరం నిర్మాణం ప్రతి హిందువుకు ఆకాంక్ష… అలాంటి ఆకాంక్ష మోదీ నేరవేర్చారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఇలాంటి సదస్సు ఉపయోగకరం” అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.
Leave a Reply