భీమ్ న్యూస్ ప్రతినిధి పోరుమామిళ్ళ (ఫిబ్రవరి 18) వై యస్ ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఇందిరానగర్ గ్రామానికి చెందిన ఎంపిపిఎస్ ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులు చదువుతున్న విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించే ఆలోచన మానుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి అన్నారు. అనంతరం సోమవారం కడప నగరంలోని డిఇఒ కార్యాలయంలో ఎడి మునీర్ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా పాఠశాలలో సొంత ఊరులోనే ఉంటూ ఎంతోమంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిపై చదువుల కోసం వెళ్లారని తెలిపారు. ఇటీవల జిఒ నంబర్ 117 విధానాన్ని దొడ్డి దారిలో తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. మండలంలోని ఇందిరానగర్ పాఠశాలను 3,4,5 తరగతుల విద్యార్థులను కొర్రపాటిపల్లి గ్రామానికి పాఠశాలకు తరలించే విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. జిల్లాలోని 8 ప్రాథమిక పాఠశాలలు తరలించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉన్న చిన్న వయస్సు విద్యార్థులు దూర ప్రాంతాల రాకపోకల సమయంలో ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలను తరలిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధమవుతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు జాలా సుమంత్, నాయకులు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
Leave a Reply