భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (ఫిబ్రవరి 20) కర్ణాటకకు చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం దగ్గరకు రాగా.. నరేష్ కుమార్ సహాయకుడు గేటు తీయాలని ఉద్యోగి బాలాజీని అడిగారు. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని.. ఒకవేళ దీనిపై ఏదైనా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని చెప్పారు. ఆ వెంటనే పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగిని దూషించారు. ‘నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా. ఏయ్ నువ్వు బయటకు పోవయ్యా, థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు. వాడి పేరేంటి. నీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు బయటకు పో, ఏం మాట్లాడుతున్నావు’ అంటూ రెచ్చిపోయారు. వెంటనే అక్కడికి వచ్చిన టీటీడీ వీజీవో సురేంద్ర, పోటు ఏఈవో మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్ కుమార్కు సర్దిచెప్పి మహాద్వారం గేటు తీసి బయటకు పంపించారు.
నరేష్ కుమార్ స్టేట్మెంట్ ను టీటీడీ విజిలెన్స్ విభాగం నమోదు చేసుకున్నాయి. అంత పరుష పదజాలంతో దూషించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ అడిగినట్లు సంచారం. నరేష్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ను టీటీడీ ఉన్నతాధికారులకు విజిలెన్స్ అధికారులు సమర్పించారు. ఇదే అంశంపై సీఎంఓ సైతం ఆరా తీశారు. ఇక ఇదే అంశంపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. సామాన్య భక్తులకు, ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎంత పాలకమండలి సభ్యుడైతే మాత్రం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి పై అంతంత మాటలు ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. రెండేళ్లకు ఊడిపోయే పదవిని చూసుకొని అంతలా అవమానించడం చాలా బాధాకరమని భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై టీటీడీ ఉద్యోగ సంఘాలు సైతం భగ్గుమంటున్నాయి. మహా ద్వారం వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన… ఆ నియమం బోర్డు సభ్యులకు వర్తించదా అంటూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. బాలాజీ పై దురుసుగా ప్రవర్తించిన పాలకమండలి సభ్యుడు నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. పాలకమండలి సభ్యుల నుంచి గత మూడు నెలలుగా వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. ఓ పాలకమండలి సభ్యురాలు ఓ ఉద్యోగిని బదిలీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
నరేష్ కుమార్ పాలక మండలి బోర్డు సభ్యత్వం రద్దు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టిటిడి ఉద్యోగులకు నరేష్ కుమార్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులను అకారణంగా బదిలీ, వేటు వేసిన వారిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతామన్నారు. టిటిడి పాలకమండలి సభ్యుడు నరేష్ కు కేటాయించిన కారు, గెస్ట్ హౌస్, వెనక్కి తీసుకోవాలని త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కొందరు పాలకమండలి సభ్యులు చేస్తున్న తప్పిదాల వల్ల టీటీడీ ప్రతిష్టకు భంగం కలుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి తప్పు చేస్తే సరిదిద్దాల్సిన పాలకులే తప్పు చేయడం దారుణమని అంటున్నారు. గర్వం లేకుండా సేవ భావంతో పనిచేసే వారికే పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. పాలకమండలి సభ్యుడైతే శ్రీవారి ఆలయం అంతా తనది కాదని సభ్యులు కూడా సేవకులే అనే మాట మరచిన నరేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Leave a Reply