భీమ్ న్యూస్ ప్రతినిధి తోటపల్లి గూడూరు (ఫిబ్రవరి 27) నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామ పంచాయతీ రావూరు వారి కండ్రిగ ప్రదేశంలో వేసిన మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ లో వరిగొండ పంచాయతీకి ఇచ్చిన పదిశాతం స్థలం కన్పించడం లేదని గ్రామస్తులు ఉండ్రాళ్ళ శ్రీనివాసులు, కొక్కంటి వెంకటసుబ్బయ్య కలిసి వెతకడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ వెతుకులాటలో పంచాయతీకి ఇచ్చిన పదిశాతం స్థలం ఎట్టకేలకు దొరికింది. లే అవుట్ లో పంచాయతీకి దానంగా ఇచ్చిన పదిశాతం స్థలం మళ్ళీ మరొకరికి అమ్మకాలు జరిపారని విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
అసలేం జరిగింది.?
పూర్తి వివరాల్లోకి వెళితే, రావూరి వారి కండ్రిగ ప్రాంతంలో పట్టా నెంబర్: 515 లో సర్వే నెంబర్: 773 /1 లో ఎ 0.60 సెంట్లు, 772/A లో ఎ 0.60 సెంట్లు, 772/B లో ఎ 0.50 సెంట్లు. మొత్తం ఎ 1.90 సెంట్లు/ 0.769 హెక్టార్లు భూమిని 2010 సంవత్సరంలో The Regional Deputy Director of Town and planning, Nellore వారిచే L.P. Number: 162/2010/DTCPO/NLR నెంబరుతో అనుమతులు తీసుకుని ఆ భూమిని లే అవుట్ గా అభివృద్ధి చేసి, ప్లాట్లుగా వేసి మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ అని పేరు పెట్టారు. మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ యజమాని ఆరుగుంట మహేంద్రరెడ్డి 2018/05/16 తేదిన వరిగొండ గ్రామ పంచాయతి కార్యదర్శి బద్దిక మాల్యాద్రి రావు పేరు మీద లే అవుట్ లోని రోడ్డు నెంబర్ 01లో 0.19 సెంట్లు/ 114 అంకణాలు స్థలాన్ని నెల్లూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్: 5249/2018 తో రిజిస్ట్రేషన్ చేయించారు.
మిస్టరీ వీడింది..!
మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ కి ప్రక్కనే అనుకుని వున్న సర్వే నెంబర్: 773/1 లో ఎ.1.08 సెంట్లు భూమిని పిడూరు భాను ప్రకాష్ రెడ్డి, సూరం రాజశేఖర్ రెడ్డి లు, దేవిశెట్టి వెంకటసుబ్బయ్య, దేవిశెట్టి స్వర్ణలక్ష్మి వద్ద 2021/08/03 తేదీన కొనుగోలు చేశారు. ఆ భూమిలో అనధికార లే అవుట్ వేశారు. మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ యాజమాన్యం పంచాయతీకి దానంగా ఇచ్చిన పదిశాతం భూమిని కబ్జా చేసి, 2023/07/17 తేదీన ముత్తుకూరు మండలం పిడతా పోలూరు గ్రామస్తుడు మేకల రమణయ్య అనే వ్యక్తికి అమ్మకాలు జరిపారు. అక్కడ మార్కెట్టు ధర ఒక అంకణం లక్షా ఎనభై వేల రూపాయలు వుండటంతో మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ యజమాని వరిగొండ పంచాయతీకి ఇచ్చిన పదిశాతం స్థలాన్ని పిడూరు భాను ప్రకాష్ రెడ్డి, సూరం రాజశేఖర్ రెడ్డి లు, గ్రామ పంచాయితీలోని అవినీతి అధికారుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వేరే వ్యక్తులకు అమ్మకాలు చేశారు. కొంత స్థలంలో ప్రస్తుతం అక్కడ తారు రోడ్డు కూడా వేసి వున్నారు. వాస్తవాలను దాచి పెట్టి, ఈ రోడ్డు ఓ కాలనీకి దారి కోసం వేశారని ప్రస్తుత తోటపల్లి గూడూరు మండల విస్తరణాధికారి వసుందరాదేవి జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం.
మండల అధికారుల్లో స్పందన కరువైందా..?
గత మూడేళ్ల నుంచి పంచాయతీకి ఇచ్చిన పదిశాతం స్థలం కన్పించడం లేదని కొందరు గ్రామస్తులు వెతకడం మొదలు పెట్టిన తర్వాత వరిగొండ పంచాయతీలో వేసిన అనధికార లే అవుట్ లలో కాలువ పోరంబోకు ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి లే అవుట్ లలో కలుపుకుని కోట్లల్లో సొమ్ము చేసుకుని భారీ అవినీతికి పాల్పడ్డారనే విషయం బయటకు పొక్కింది. దీంతో గ్రామ స్థాయి అధికారి నుండి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వరకూ అందరినీ కలిసి వినతి పత్రాలు సమర్పించి, పంచాయతీలో జరిగిన భారీ అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు ప్రయత్నం చేస్తూనే వున్నా మండల అధికారుల్లో స్పందన రాకపోవడం కడు విచారకరం.
గ్రామ పరిపాలన క్రమబద్ధీకరణ అవుతుందా.?
ప్రస్తుతం వరిగొండ పంచాయతీ కార్యదర్శిగా వున్న ప్రవల్లిక 2022 లో కూడా ఈ పంచాయతీకి కార్యదర్శిగా పనిచేశారు. ఈ పంచాయతీ నందు వేసిన లే అవుట్ లలో జరిగిన భారీ అవినీతి గురించి తెలుసుకుని కూడా జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా మౌనం వహించడం విశేషం. వరిగొండ గ్రామ పంచాయతీ గ్రేడ్ 01 లో వుంది, కానీ ప్రస్తుతం ఈ పంచాయతీకి గ్రేడ్ 04 కార్యదర్శి ప్రవల్లిక ను నియమించారు. అందుకే లే అవుట్ విషయాల్లో పూర్తి అవగాహన లేమి, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని, పరిపాలన అస్తవ్యస్తంగా వుందని గ్రామస్తులలో బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కార్యదర్శిని మార్చాల్సిన అవసరం ఎంతైనా వుందని, జిల్లా ఉన్నతాధికారులు ఈ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ పరిపాలనను క్రమబద్ధీకరణ చేయాలని గ్రామస్తులు మీడియా ముఖంగా కోరుతున్నారు.
Leave a Reply