భీమ్ న్యూస్ ప్రతినిధి విశాఖపట్నం (మార్చి 03) ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామనుకున్న చోట అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పరాజయం పొందాయి. ఈ ఫలితం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్న కూటమికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తీర్పునివ్వడం కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ కాగా రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. తాజాగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఉత్తరాంధ్రలో కీలకమైన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీచర్లు సంచలన తీర్పునిచ్చారు. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకాలపాటి రఘువర్మ పోటీ చేశారు. పీఆర్టీయూ తరఫున ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు :
అయితే ఎన్నికల్లో అనూహ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మొదటి నుంచి పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ముందంజలో కొనసాగుతూ వచ్చారు. ఎక్కడ కూడా తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థి పోటీనివ్వలేదు. మొత్తం 11 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు.
ఖంగుతిన్న కూటమి :
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 10 మంది పోటీ చేశారు. 8 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్ చేస్తుండగా గాదె శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ సాధించారు. దీంతో అతడి విజయం ఖాయమైంది. గాదె విజయం ఖాయం కావడంతో అతడి మద్దతుదారులు, పీఆర్టీయూ ఉపాధ్యాయులు సంబరాల్లో మునిగాయి. అయితే తాము బలపర్చిన రఘువర్మ ఓటమితో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఖంగుతిన్నాయి. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం తీసుకునే విద్యావ్యవస్థలో అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఈ విధమైన ఓటమి వైఖరి కనబడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీవో నెంబర్ 117 రద్దు చేయడం, గ్రామాల పాఠశాల స్థితిగతులను సరైన పద్ధతిలో విచారణ చేయకుండానే పాఠశాలల విలీనం చేయడం, పంచాయతీ కేంద్రాల్లో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం మూలంగా హాబిటేషన్ గ్రామాల్లో పూర్తిగా పాఠశాలలు 3,4,5 తరగతులను విలీనం చేయడం, ఏపీలో నూతన విద్యా విధానం- 2020 ని తూచ తప్పకుండా పాటించడం, విద్యా వ్యవస్థకు తీరని ఆటంకాలుగా ఏర్పడి ఏపీలో విద్యా వ్యవస్థ కుంటుపడుతున్నందునే ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయులు మేల్కొని ప్రభుత్వానికి సరైన గుణపాఠం తెలపాలనే ధోరణి కచ్చితంగా వ్యక్తం అయిందని పలువురు విద్యావేత్తలు రాజకీయవేత్తలు, ప్రజలు, తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వినిపిస్తున్నారు.
Leave a Reply