భీమ్ న్యూస్ ప్రతినిధి ఏలూరు (మార్చి 04) ఏపీలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థి పిడిఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘువులుపై 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపుతో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జనవరి 29న ఉభయగోదావరి జిల్లాల ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 13న విత్‌డ్రాల పర్వంతో నామినేషన్ల ప్రక్రియ ముగియగా 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఫిబ్రవరి 27న ఎన్నికల పోలింగ్ జరగ్గా మొత్తం 3,14,984 ఓట్లకుగాను 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని బ్యాలెట్ బాక్సులను ఏలూరు సిఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరిచారు. ఈ నెల మూడో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
దాదాపు 12 గంటలపాటు ఓట్లు కట్టలు కట్టడమే సరిపోయింది. దాదాపు 16 గంటలకు రాత్రి 11.45 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు వెల్లడించారు. 28 టేబుళ్లు ఏర్పాటు చేసి టేబుల్‌కు వెయ్యి ఓట్లు చొప్పున ఎనిమిది రౌండ్లుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగింది. ప్రతి రౌండ్ ఫలితం దాదాపు రెండు నుంచి మూడు గంటల వరకూ పట్టింది. దాదాపు 30 గంటల తర్వాత నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. తొలి ప్రాధాన్యతా ఓటును లెక్కిస్తూ, చెల్లని ఓట్లను పక్కన పెడుతూ కౌంటింగ్ ప్రక్రియ సాగింది.తొలి ప్రాధాన్యతా ఓట్లతోనే టిడిపి అభ్యర్థి గెలుపు ఎంఎల్‌సి ఎన్నికల్లో పోస్టల్ ఓట్లతో కలిపి మొత్తం 2,18,997 ఓట్లు పోలైనట్లు అధికారులు తేల్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టగా 19,789 ఓట్లు చెల్లనివి తేలాయి. చెల్లుబాటు ఓట్లు 1,99,208గా తేల్చారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపు సాధించాలంటే 99,604 ఓట్లు రావాల్సి ఉండగా టిడిపి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొత్తం 1,24,702 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్లోనూ 15 వేలకు పైగా ఓట్లు సాధిస్తూ టిడిపి అభ్యర్థి పైచేయి సాధిస్తూ ముందుకెళ్లారు. మొత్తం ఎనిమిది రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగ్గా ఏడో రౌండ్లోనే టిడిపి అభ్యర్థి గెలుపునకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్‌ను దాటేశారు. పిడిఎఫ్ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో మొత్తం 47,241 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు జివి.సుందర్‌కు 16,183 ఓట్లు వచ్చాయి. విజయం సాధించిన టిడిపి అభ్యర్థికి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ధ్రువీకరణపత్రం అందించారు.
ఎన్నికల్లో గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరానికి సమీప ప్రత్యర్ధి దిడ్ల వీర రాఘవులు అభినందనలు తెలిపారు. కౌంటింగ్ ఆలస్యంపై సర్వత్రా అసహనం ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. పక్కన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఫలితం మూడో తేదీ రాత్రికే స్పష్టత రాగా, ఇక్కడ మాత్రం నాలుగోతేదీ మధ్యాహ్నం రెండుగంటల వరకూ సాగింది. సరైన ప్రణాళిక లేకుండా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారనే చర్చ సర్వత్రా సాగింది. సిబ్బంది మూడు షిఫ్టులుగా లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఓటింగ్ ప్రక్రియపై అవగాహనలో అధికారులు విఫలం ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓట్లు వేసే అంకెలపై అధికారులకు, ఏజెంట్లకు మధ్య మూడో తేదీ రాత్రి వాగ్వివాదం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం అభ్యర్థి పేరు ముందు బాక్సులో ఒకటి మాత్రమే వేయాలని, రోమన్ అంకెలు వేయకూడదని, అలా వేస్తే చెల్లదని చెబుతూ వచ్చారు. కానీ కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం రోమన్ అంకె ఒకటి వేసినా చెల్లుబాటు అవుతుందని తేల్చారు. అదేవిధంగా ఒకటి అంకె తప్ప గడిలో మరేమీ వేయకూడదని ప్రచారంలో అభ్యర్థులు సైతం ఓటర్లకు తెలిపారు. ఒకటికి ముందు జీరో వేసినా ఓటు చెల్లుబాటు అవుతుందని కౌంటింగ్‌లో అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ఒకటి వేసి ఒకటి చుట్టూ సున్నా చుట్టినా ఓట్లు చెల్లుబాటు అవుతాయని చెప్పడంపై పలువురు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు.
ఎన్నికల ముందు అభ్యర్థులతో జరిగిన సమావేశాల్లో ఓటింగ్ ప్రక్రియపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే ఇది జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల నిబంధనావళి బుక్‌లో ఉన్నట్లు అధికారులు చెప్పడం విశేషం. ఓట్లలో తేడా.. చెల్లని ఓట్లు 19,789 ఫిబ్రవరి 27వ తేదీన ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ జరిగింది. అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం మొత్తం 2,18,902 ఓట్లు పోలవగా 69.50 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. పోస్టల్ ఓట్లు 243 కలుపుకుంటే మొత్తం 2,19,145గా ఉండాలి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక అధికారులు ఇచ్చిన లెక్కలు చూస్తే మొత్తం ఓట్లు 2,18,997గా పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఇచ్చిన లెక్కలకు, కౌంటింగ్ పూర్తయ్యాక ఇచ్చిన లెక్కలకు 148 ఓట్లు తగ్గాయి. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో గతంలో ఇచ్చిన లెక్కలు, ప్రస్తుతం ఇచ్చిన లెక్కలపై అంతటా అయోమయం నెలకొంది. పట్టభద్రులు ఎన్నికల్లో సైతం చెల్లని ఓట్లు భారీగా నమోదవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 19,789 ఓట్లు చెల్లనివిగా తేలాయి. ఎక్కువ మంది అంకెలు వేయకుండా టిక్కులు పెట్టడం వల్ల చెల్లని ఓట్లుగా మిగిలిపోయాయి. పోస్టల్ ఓట్లు 243 పోలవగా, అందులో చెల్లని ఓట్లు 42గా ఉన్నాయి. చదువుకున్న వారుసైతం ఓటు సరిగా వేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గెలుపోటములకు కారణాలపై చర్చ ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి గెలుపునకు ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. ముందుగా అభ్యర్థిని ప్రకటించడం కలిసొచ్చింది. అంతేకాకుండా ఓటర్ల చేర్పులో ప్రత్యేక శ్రద్ద కనబరిచారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఎలు, గ్రామస్థాయి నాయకులు వరకూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం. 30 మంది ఓటర్లకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయడం, సోషల్ మీడియా, టెక్నాలజీని బాగా వినియోగించుకోవడం, ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు ప్రత్యేక శ్రద్ద కనబరచడం. ఆర్థిక బలం ఇలా అనేక అంశాలు టిడిపి అభ్యర్థి గెలుపునకు ప్రధాన కారణమయ్యాయి. కూటమిపై నమ్మకమే గెలుపునకు కారణం. పేరాబత్తుల రాజశేఖరం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ గెలుపునకు కారణం. ఎన్నికల రోజు లోకేష్ నిరంతరం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ముందుకు నడిపించారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చి గెలుపునకు లోకేష్ ఎనలేని కృషి చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం ఆనందంగా ఉంది. పట్టభద్రులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నా గెలుపునకు కృషి చేసిన నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలుదిడ్ల వీరరాఘవులు, పిడిఎఫ్ అభ్యర్థి ఎంఎల్‌సి అభ్యర్థిగా నామినేషన్ ఘట్టం నుంచి చివరి వరకూ నాకు మద్దతు తెలిపి ఓటేసిన పట్టభద్రులకు, నా ప్రచారంలో పాల్గొని సహకరించిన శ్రేణులకు అందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మహిళల, యువత పక్షాన పోరాటం కొనసాగుతోందని తెలిపారు.
Leave a Reply