భీమ్ న్యూస్ ప్రతినిధి ముత్తుకూరు (మార్చి 06) నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మామూళ్ళ మత్తులో మునిగి తేలుతోందని మండల ప్రజలు కోడై కూస్తున్నారు. ఆ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు కలెక్షన్ ఏజెంట్లు గా వ్యవహరిస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చూస్తే ఆ పుకార్లు వాస్తవాలని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో వున్న తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతిలో వేసిన మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ లో సర్వే నెంబర్ 771/1, 772/a, 772/b, 773/1 లలో 19 సెంట్లు భూమిని, సదరు లే అవుట్ యజమాని ఆరుగుంట మహేంద్రరెడ్డి వరిగొండ పంచాయతికీ పదిశాతం భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ పదిశాతం భూమిని కబ్జా చేసి అమ్మకాలు చేశారని వరిగొండ పంచాయతి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, వరిగొండ గ్రామ కార్యదర్శి ప్రవల్లికకు ఆ సమస్యను పరిష్కారం చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో కార్యదర్శి ప్రవల్లిక, వరిగొండ పంచాయతీకి ఇచ్చిన పదిశాతం భూమిలోని సర్వే నెంబర్లలో అమ్మకాలు కొనుగోలు జరిగి వుంటే, ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ 2025/01/06 తేదీన ముత్తుకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కి అర్జీ సమర్పించారు. ఈ అర్జికి సమాధానంగా ముత్తుకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆ సర్వే నెంబర్లలో అమ్మకాలు కొనుగోలు ఏమీ జరగలేదని స్పష్టం చేస్తూ 2025/01/08 వ తేదీన కార్యదర్శి ప్రవల్లికకు లేఖను ఇచ్చారు.
అయితే, 2023/07/17 వ తేదీన పిడూరు భానుప్రకాష్ రెడ్డి, సూరం రాజశేఖర్ రెడ్డి అను వ్యక్తులు సర్వే నెంబర్: 773/1 లో 53.65 అంకణముల స్థలాన్ని మేకల రమణయ్య అనే వ్యక్తికి అమ్మకాలు చేసి ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు డాక్యుమెంట్ నెంబర్: 2985/2023 లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయాన్నీ దాచిపెట్టి, అమ్మకాలు కొనుగోలు ఏమీ జరగలేదని కార్యదర్శికి లేఖ ఇవ్వడం విశేషం.
దీన్ని బట్టి చూస్తే ముత్తుకూరు కార్యాలయంలో అధికారులు మామూళ్ళు మత్తులో మునిగిపోయారని అర్ధమవుతోంది. ఆ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు కలెక్షన్ ఏజెంట్లు గా వ్యవహరిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. తప్పు ఎవరిది.? ఒక్కో డాక్యుమెంట్ కు ఒక్కో తీరుగా మామూళ్లు సమర్పించుకుంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న డాక్యుమెంట్ రైటర్లదా..? డాక్యుమెంట్ రైటర్లు ఇస్తున్న మామూళ్ళు మత్తులో మునిగి ఇస్టా రాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులదా.? తప్పు ఎవరిదీ..? ప్రభుత్వ భూములను కబ్జా చేసి నకిలీ ధృవ పత్రాలు సృష్టించి గోప్యంగా రిజిస్ట్రేషన్ చేయించి, మరొకరికి అమ్మకాలు చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు ఈ కార్యాలయానికి అనుసంధానంగా వుండటం గమనార్హం. ఈ సందర్భంలో జిల్లా అవినీతి నిరోధక శాఖా ఉన్నతాధికారులు ఈ కార్యాలయంపై దృష్టి సారించి, అవినీతికి అడ్డుకట్ట వేయాలని మండలం ప్రజలు మీడియా ముఖంగా కోరుతున్నారు.
Leave a Reply