భీమ్ న్యూస్ ప్రతినిధి తోటపల్లి గూడూరు (మార్చి 08) మండల కేంద్రమైన మేజర్ పంచాయతీ సమాచారం మా పరిధి కాదు అని మండల పంచాయతీ రాజ్ శాఖ విస్తరణాధికారి స్పష్టం చేయడం ఆ అధికారి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ, తోటపల్లి గూడూరు పంచాయతీలలో వేసిన లే అవుట్ ల వివరాలు కోరుతూ ఖాజావలి అనే జర్నలిస్ట్ సమాచారహక్కు చట్టం 2005 అర్జీని మండల పౌర సమాచార అధికారికి ఇచ్చారు. దీనికి సమాధానంగా మండల విస్తరణాధికారి వసుందరదేవి వరిగొండ పంచాయితీలో కొన్ని లే అవుట్ ల సమాచారం ఇచ్చి, తోటపల్లి గూడూరు పంచాయతీ మా పరిధి కాదు అని స్పష్టం చేస్తూ లేఖ పంపారు.
తోటపల్లి గూడూరు మండలంలో 22 పంచాయతీలు వుండగా అందులో మేజర్ పంచాయతీ, పైగా మండల కేంద్రంగా తోటపల్లి గూడూరు గ్రామ పంచాయితీ వున్నది. ఈ పంచాయతీలోనే మండల కార్యాలయాలు అన్నీ ఉన్నాయి. ఆ పంచాయతీ మా పరిధి కాదు అని లేఖలో ఇవ్వడంతో ఈ తోటపల్లి గూడూరు గ్రామ పంచాయితీ ఏ అధికారి పరిధిలో వున్నదో ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారికి జర్నలిస్ట్ ఖాజావలి సమాచారహక్కు చట్టం 2005 అర్జీని ఇచ్చాడు. ఈ అర్జీకి సమాధానంగా తోటపల్లి గూడూరు గ్రామ పంచాయితీ కార్యదర్శిగా ఎం. శంకర్ ప్రసాద్, మండల విస్తరణాధికారిగా ఎస్. వసుంధర దేవి విధులు నిర్వహిస్తున్నారని మండల పౌర సమాచార అధికారి & పరిపాలనాధికారి సి.హెచ్. లక్ష్మణ కుమార్ స్పష్టం చేస్తూ లేఖ పంపారు.
ఇప్పటికే వరిగొండ గ్రామ పంచాయతీలో అనధికారకంగా లే అవుట్ లు వేసి, ఆ లే అవుట్ లలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి కోట్ల రూపాయలకు అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తి, కొందరు గ్రామస్తులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆ లే అవుట్ లలో ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను, ప్రభుత్వ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవాలని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా వరిగొండ పంచాయతీ కార్యదర్శి ప్రవల్లిక ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానం లోప భూయిష్టంగా వుందని తేటతెల్లమైంది.
ఆ కోవలోకే తోటపల్లి గూడూరు గ్రామ పంచాయితీ కూడా వస్తుందా…? ఈ పంచాయతీలో వేసిన లే అవుట్ ల వివరాల సమాచారం ఏమైంది.? మండల స్థాయి అధికారి ఆ వివరాలను దాచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు.? తన పరిధిలోనే వున్న తోటపల్లి గూడూరు మేజర్ పంచాయతీని, మా పరిధి కాదు అని మండల విస్తరణాధికారి ఆర్టీఐ లేఖలో ఎందుకు పేర్కొన్నారు.? ఇది మండల విస్తరణాధికారి బాధ్యతా రాహిత్యమా..? లేక సమాచార హక్కు చట్టం 2005 అర్జీని నీరుగార్చే ప్రయత్నమా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
Leave a Reply