భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 09) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న శనివారం మహిళలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మహిళ లేనిదే ప్రపంచంలో ఏ పనీ జరగదని, ఓర్పులో, సహనంలో భూదేవితో సమానమని పోలిక చూపారు. కానీ కావాలని కక్ష పూరితంగా ఒక ఒంటరి మహిళకు నిలువ నీడ లేకుండా చేసి, రోడ్డున పడేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పంచాయితీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పేలూరి ఎస్తేరమ్మ అనే మహిళ డేవిస్ పేట పంచాయతీ నారాయణపురం కాలనీకి ఎదురుగా వున్న ఒక ఇంటిలో అద్దెకు వచ్చింది.
కొంత కాలానికి డేవిస్ పేట గ్రామస్థులకు పరిచయం, స్నేహం ఏర్పడటంతో ఆ ఇంటికి రాక పోకలు మొదలయ్యాయి. ఎస్తేరమ్మ క్రైస్తవ మతస్తురాలు కావడంతో తన అద్దె ఇంటికి ప్రక్కన వున్న పాడుబడిన ఇల్లును కొనుగోలు చేసి, ఆ ఇంటిని తొలగించి, ఆ స్థలంలో క్రైస్తవ ప్రార్థనా మందిరం కట్టాలని ప్రయత్నం చేసింది. అప్పుడు డేవిస్ పేట గ్రామంలో కొంతమంది హిందువులు అడ్డుకుని చర్చి నిర్మాణాన్ని ఆపేశారు. ఆ క్రమంలో హిందువులు, క్రైస్తవులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఒంటరి మహిళగా వున్న ఎస్తేరమ్మకు కొంతమంది హిందూ మతోన్మాదులు నుండి వేధింపులు మొదలయ్యాయి. ఆ ఒత్తిడులను తాళలేక ఆ స్థలంలో చర్చి నిర్మాణాన్ని మానుకుని, అధికారుల అనుమతి తీసుకుని ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేసింది.
ఆ ప్రయత్నాన్ని కూడా ఆ మతోన్మాదులు అడ్డుకున్నారు. అంతటితో ఆగక ఎస్తేరమ్మకు అనుమతి ఇచ్చిన అధికారిపై తన ఉన్నతాధికారులు ద్వారా ఒత్తిడి తెచ్చి, ఆమెకు సహకరించకుండా చేయడం కూడా వేధింపుల్లో భాగమే. ఆ స్థలం వేరొకరికి అమ్ముకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఎవరినీ కొనుగోలు చేయనీయకుండా పోలీసులతో చెప్పి భయ భ్రాంతులకు గురి చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఎస్తేరమ్మకు ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమానితో మాట్లాడి ఆమె చేత ఇల్లు ఖాళీ చేయించాలని ఒత్తిడి తెచ్చారు. అద్దె ఇంటి యజమానికి కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకుని అద్దె ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పినా వినకుండా ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని ఆమెపై ఒత్తిడి పెంచారు. ఇక చేసేది ఏమీ లేక తాను కొనుగోలు చేసిన ఖాళీ స్థలంలోనే టెంట్ వేసుకొని తన సామాన్లు అక్కడ పెట్టుకుంది.
ఒంటరి మహిళ భద్రత లేని టెంట్ లో జీవనం చేయడం సురక్షితమా..? అని చుట్టు ప్రక్కల గ్రామస్తుల్లో చర్చలు మొదలయ్యాయి. తాను కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అధికారులు ఎవరూ తనకు అండగా నివలేదని వాపోయిన ఎస్తేరమ్మ మీడియా ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది. స్థానిక నియోజకవర్గం శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనకు రక్షణ మరియు భద్రత కల్పించాలని, తన సమస్యకు పరిష్కారం చూపాలని మీడియా ముఖంగా కోరుతున్నది.
Leave a Reply