భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (మార్చి 09) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై తొలి రోజు సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయి. సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు.
వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధులలో ప్రదక్షిణగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులకు దర్శనమిస్తారు.పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply