భీమ్ న్యూస్ ప్రతినిధి ముత్తుకూరు (మార్చి 11) నెల్లూరు జిల్లా ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ ఆస్థి అయినా రిజిస్ట్రేషన్ అవుతోందా.. అవును కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు తమ మాయాజాలంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుండటం ఇందుకు నిదర్శనం. నిత్యం ఇక్కడ జరిగే రిజిస్ట్రేషన్ లలో సగభాగం, డాక్యుమెంట్ లలో మాత్రమే లీగల్ గా వుంటాయి అంతే, ఆ డాక్యుమెంట్ లు భౌతికంగా పనికిరావు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు ఆస్థి రిజిస్ట్రేషన్ కోసం తమ వద్దకు వచ్చినవారికి లేదు, కాదు, కుదరదు అనకుండా ఏ అస్తినైనా తమ వాక్చాతుర్యం, ప్రతిభలతో సులభంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు సహకరిస్తుంటారు.
ఉదాహరణకు ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2021/08/13 తేదిన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్థి తాలుకా డాక్యుమెంట్ నెంబర్: 1844/2021 ను పరిశీలిస్తే, ఈ ఆస్థి నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లి – 2 రెవిన్యూ పరిధి, మాదరాజు గూడూరు గ్రామంలోని సర్వే నెంబర్ : 382 పట్టా భూమి. భౌతికంగా ఆ భూమి వద్దకు వెళితే అది నెల్లూరు నుండి కృష్ణాపట్నం గ్రామానికి ప్రవహించే నీటి పారుదల కాలువకు సంబంధించిన ప్రభుత్వ కాలువ పోరంబోకు భూమి, సర్వే నెంబర్: 381/2. ఇక్కడ అసలు వాస్తవం ఏంటంటే సర్వే నెంబర్: 381/2 లోని ప్రభుత్వ కాలువ పోరంబోకు భూమిని కబ్జా చేసి, ప్రక్కన వున్న పట్టా భూమి సర్వే నెంబర్: 382 ను డాక్యుమెంట్ లో కనబరచి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించారు. అదే పట్టా భూమి సర్వే నెంబర్: 382 ను కనబరచి ఆ ఆస్తిని మరి కొంతమందికి అమ్మకాలు చేశారు. మరో విశేషం ఏంటంటే ఈ ఆస్తిని (డాక్యుమెంట్ నెంబర్: 4616/2024) తనఖా పెట్టి ఒక ప్రైవేట్ ఫైనాన్సు బ్యాంకులో 25 లక్షల రూపాయలు లోను తీసుకోవడం కొసమెరుపు. భౌతికంగా వున్న ప్రభుత్వ కాలువ పోరంబోకు భూమి అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయి.
కబ్జా చేసిన కాలువ పోరంబోకు భూమి అమ్మకాలకు ఆధారమైన డాక్యుమెంట్
అదే విధంగా ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2023/07/17 తేదిన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్థి తాలుకా డాక్యుమెంట్ నెంబర్: 2985/2023 ను పరిశీలిస్తే, ఈ ఆస్థి తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామ రెవిన్యూ పరిధి, రావూరువారి కండ్రిగ గ్రామంలోని సర్వే నెంబర్ : 773/1 మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ లో ఒక ప్లాటు. అయితే గతంలో మహేంద్రరెడ్డి నగర్ లే అవుట్ యజమాని ఆరుగుంట మహేంద్రరెడ్డి 2018/05/16 తేదిన వరిగొండ గ్రామ పంచాయతి కార్యదర్శి బద్దిక మాల్యాద్రిరావు పేరు మీద ఆ లే అవుట్ లో సర్వే నెంబర్లు: 771/1, 772/a, 772/b, 773/1 లలో 0.19 సెంట్లు స్థలాన్ని వరిగొండ గ్రామ పంచాయతీకి పదిశాతం భూమి దానంగా ఇస్తూ నెల్లూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్: 5249/2018 తో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో వాస్తవం ఏంటంటే వరిగొండ గ్రామ పంచాయతీకి ఆరుగుంట మహేంద్రరెడ్డి ఇచ్చిన పదిశాతం భూమిని ప్రక్కనే వున్న బి.ఆర్. నగర్ లే అవుట్ యజమానులు కబ్జా చేసి, మరొకరికి అమ్మకాలు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు.
వరిగొండ పంచాయతి ఆస్తిని కబ్జా చేసి అమ్మకాలు చేసిన డాక్యుమెంట్
వరిగొండ పంచాయతికి దానంగా ఇచ్చిన డాక్యుమెంట్
ఈ డాక్యుమెంట్ లో కనబరచిన సర్వే నెంబర్: 773/1 భూమి వరిగొండ గ్రామ పంచాయతికి చెందిన ఆస్థి కావడం గమనార్హం. ఈ విషయంలోనే వరిగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవల్లిక ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ ని వివరాలు కోరితే, డాక్యుమెంట్ నెంబర్: 2985/2023 రిజిస్ట్రేషన్ వివరాలను దాచి పెట్టి, ఆ సర్వే నెంబర్లలో ఏ విధమైన అమ్మకాలు, కొనుగోలు జరగలేదని సబ్ రిజిస్ట్రార్ లేఖ ఇవ్వడంతోనే ఆ కార్యాలయంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తోంది. ఇందులో డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులతో పాటు రెవిన్యూ శాఖా, నీటిపారుదల శాఖా అధికారులు కూడా భాగస్వామ్యం కావడం కడు విచారకరం.
పంచాయతీ కార్యదర్శికి సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన లేఖ
Leave a Reply