భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 12) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లి గ్రామ సర్వేయర్ విజయ్ కుమార్ ను తన విధులు నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుడుముల రామచంద్రయ్య డిమాండ్ చేశారు. నేడు మండల తహశీల్దార్ కార్యాలయం నందు రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ శివ కుమార్ కి సర్వేయర్ విజయ్ కుమార్ పై ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ కొరుటూరు గ్రామ పంచాయితీ యానాది దిబ్బ ప్రాంత నివాసుల శ్మశాన భూమిని కాజేయాలని దురుద్దేశ్యంతో అదే గ్రామ పంచాయితీకి చెందిన ఎస్. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రెవిన్యూ సదస్సులో అర్జీ పెట్టారని ఆరోపించారు. ఆ అర్జీలోని విషయాన్ని పరిశీలించుటకు మండల సర్వేయర్ హరనాథ్, గ్రామ సర్వేయర్ చైతన్య లు నిన్న మంగళవారం ఆ భూమి వద్దకు వెళ్ళి భూమి కొలతలు తీసుకున్నారు. అయితే అంతకంటే ముందు ఆ శ్మశాన భూమి వద్దకు మైపాడు గ్రామానికి చెందిన సర్వేయర్ విజయ్ కుమార్ వచ్చి, ఆ భూమి ఎస్. వెంకటేశ్వర్లు ది అని చెప్పి ఆ భూమి జోలికి ఎవరూ రావద్దని యానాది దిబ్బ ప్రాంత వాసులను హెచ్చరించారని, అంతటితో ఆగకుండా యానాది దిబ్బ ప్రాంత వాసులను కులం పేరుతో నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారని తెలిపారు. ఎస్టీ యానాది కులస్థులు వాడుకునే శ్మశాన భూమిని కబ్జా చేయాలనే దురాలోచన వున్న వ్యక్తికి ఇలా మద్దత్తుగా ఒక ప్రభుత్వ అధికారి మాట్లాడి, కులం పేరుతో దూషించడం వల్ల అతనిని తన విధులు నుండి వెంటనే తొలగించాలని, అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాలని కోరారు.
సర్వేయర్ విజయ్ కుమార్ వివరణ
ఇందుకూరుపేట మండలం భీమ్ న్యూస్ ప్రతినిధి సర్వేయర్ విజయ్ కుమార్ ను వివరణ కోరగా నేను తిట్టింది ఎస్. వెంకటేశ్వర్లు ను, అది కూడా ప్రభుత్వం అనుమతులు లేకుండా ఆ ప్రాంతంలో చెట్లు నరికి, గుంటలు తీసినందుకు తిట్టాను, నేను ఎస్టీ యానాదులను తిట్టలేదు అని తెలిపారు. అయితే ఈ సర్వేయర్ విజయ్ కుమార్ మైపాడు, సోమరాజుపల్లి, కొరుటూరు పంచాయతీలలో రీ-సర్వే జరిగేటప్పుడు పలు రెవిన్యూ రికార్డులు తారు మారు చేశాడనే ఆరోపణలు వచ్చి, పలు చోట్లకు బదిలీ అయ్యి వుండటం గమనార్హం.
Leave a Reply